Wednesday, 19 October 2011

ప్రభాస్, కొరటాల శివ చిత్రం షురూ

ప్రభాస్ కథానాయకుడిగా తాజా చిత్రం మొదలైంది. 'బృందావనం', 'ఊసరవెల్లి' చిత్రాల రచయిత కొరటాల శివ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రభాస్ స్నేహితులు వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా యు.వి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం ఉదయం జరిగింది.

ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్‌నిచ్చారు. ఎం.ఎం.కీరవాణి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దిల్‌రాజు గౌరవ దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్.రాజమౌళి, వేణు శ్రీరామ్, మచ్చరవి, వక్కంతం వంశీ, రవిందర్, శిరీష్, లక్ష్మణ్, జెమిని కిరణ్, బన్నివాసు తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ "ఈ చిత్రంలో మా హీరో ప్రభాస్ పాత్ర తీరుతెన్నులు వైవిధ్యంగా ఉండటమే కాకుండా గెటప్ కూడా కొత్తగా ఉంటుంది.

ఇంతకుముందు ప్రభాస్ ఆ గెటప్‌లో ఎవరూ చూసి ఉండరు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తాం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇద్దరు ప్రముఖ నాయికలు ప్రభాస్ సరసన నటిస్తారు. వారి వివరాలను త్వరలో ప్రకటిస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది'' అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ "ప్రభాస్ కథానాయకుడిగా నా తొలి చిత్రం ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ప్రభాస్ ఇమేజ్‌కి ఏ మాత్రం తగ్గకుండా కథ ఉంటుంది'' అని అన్నారు.

"నా స్నేహితులు వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం కథ నాకు బాగా నచ్చింది. నవంబర్ నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. కమర్షియల్ హంగులన్నీ ఉంటాయి. దేవిశ్రీ సంగీతం మెప్పిస్తుంది. అన్ని వర్గాల వారికీ చేరువవుతుంది'' అని ప్రభాస్ అన్నారు.

ఈ చిత్రానికి కళ: ఎ.ఎస్.ప్రకాష్, యాక్షన్: అరసు, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్: అశోక్‌కుమార్ రాజు, రచన-దర్శకత్వం: కొరటాల శివ.

No comments:

Post a Comment